Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ఈ హత్యాపాపం నిజంగా వారిదే... ???


చాలా రోజుల తర్వాత నేను నా బ్లాగ్‌లో రాస్తున్నాను. అందుకు కారణం తాజాగా చదివిన రాజు గారి ఐటమ్ "ఈ హత్యా పాపం ఎవరిది" అనే అంశం. ఈ అంశం చదివినపుడు నాలో ఎక్కడో అసంపూర్ణంగా ఉన్న కొన్ని ప్రశ్నలు కొంత రూపం సంతరించుకున్నాయి.
(రాజు గారి వ్యాసం కోసం ఈ ఐడీలో దర్శించండి http://raju123.mywebdunia.com/2008/08/01/1217589720000.html )

రాజు గారు చెప్పినట్టు కమలేష్ ఉరిపోసుకోవడానికి కారణం ఎవరా అని నేనూ కాసేపు ఆలోచించాను. (నా రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన కారణంగా అంతకంటే ఆలోచిద్దామంటే నాకు సమయం లేదు కాబట్టి) అయితే ఆ కాసేపు ఆలోచిస్తే నాకో విషయం స్ఫూరణకు వచ్చింది.

బహుశా నేనిప్పుడు రాయబోయే వాక్యం తరచూ మనం వినేదే. ఇకముందూ వినబోయేదే. ఆ రోజుల్లో మేము మా తల్లితండ్రులకు ఎంత విలువ ఇచ్చేవారిమో తెలుసా... వారు గీసిన గీత ఏనాడూ దాటేవారిమి కాము. ( ఎగిరి దూకేవారు) కానీ ఈ కాలం పిల్లలు మాత్రం కొంచెం కూడా తల్లితండ్రుల మాటలు లక్ష్య పెట్టడం లేదు. మనమేమన్నా మనకోసం చెబుతున్నామా... వారి బాగు కోరేగా వారిని దండించేది... ఓ వయసు పిల్లలున్న తల్లితండ్రులు ఓచోట కలిస్తే ఇలా సాగుతుంటుంది వారి మధ్య సంభాషణ.

ఈ సంభాషణ విన్నప్పుడు నిజమే కదా ఈకాలం పిల్లలు తల్లితండ్రుల మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. అందుకే వచ్చే కాలం కన్నా గడిచిన కాలమే మంచిది లాగుంది అంటూ మనలోనూ ఏమూలో దాగున్న కాస్త వేదాంత ధోరణి, మరికాస్త చాదస్త ధోరణి బయటకొచ్చి ఓ చిన్న స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంటుంది.

అయితే నాకు మాత్రం ఎందుకో పైన పేర్కొన్న సంభాషణ విన్నప్పుడు వేరేలా అనిపిస్తుంది. (ఒకవేళ నేను అందరిలా ఆలోచించడం లేదు కాబోలు...) ఆరోజుల్లో నేను నా తల్లితండ్రులకు భయపడ్డాను కదా (అలా నటించాను కదా?) మరి ఇప్పుడు నా కొడుకు/కూతురు మాత్రం నా మాట వినదేంటి... అందుకే నాలుగు తగిలించైనా సరే నా మాట వినేలాగా చేయాలి.

అయినా ఎప్పుడూ వాళ్లకి నచ్చిందే చేయడమేంటి ఇలాగే పోతే రేపు వీళ్లు నామాట వింటారా...? అని తల్లితండ్రులు వేదన పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కాబోలు ప్రస్తుత తల్లితండ్రులు ఆనాటి వారి తల్లితండ్రులకు భయపడి? వారి జీవితంలో నెరవేర్చుకోలేని కోర్కెలను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని ఆలోచిస్తుంటారు.

ఇంతవరకూ నేను రాసినట్టు అచ్చం అలాగే అందరు తల్లితండ్రులు ఆలోచిస్తూ ఉండకపోవచ్చు. కానీ చాలామంది తల్లితండ్రులు మాత్రం ఇలానే ఆలోచిస్తున్నారు. అందుకే పిల్లల జీవితాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇక్కడ మీకో రెండు ఉదాహరణలు చెప్తాను. వాటిని మీరు ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా అన్వయించుకుంటారో మీ ఇష్టం...

1. పిల్లలను ఐదేళ్ల వరకు స్వేచ్ఛగా పెరగనీయండి. చదువు పేరుతో వారిని మూడేళ్లనుంచే చదువు పేరుతో బాధిస్తూ బడి అంటే వాళ్ల దృష్టిలో జైలు అనే భావాన్ని తెప్పించకండి... అంటూ పెద్ద పెద్ద విద్యా వేత్తలు, బాగా చదువుకున్న? విద్యావేత్తలు ఉపన్యాసాలు దంచేస్తుంటారు. కానీ వారి పిల్లల్ని మూడేళ్లకే బస్తాడు పుస్తకాలు భుజాన వేసి స్కూలుకు పంపేస్తుంటారు.

ఒకవేళ అక్కడ ఎవరైన కాస్త జ్ఞానమున్న టీచర్లుండి మూడేళ్లకే చదువు, హోం వర్క్ ఏంటి అని ఆ పిల్లల చేత ఆటలు, పాటలు పాడించారనుకోండి. అదేం స్కూలురా బాబూ పిల్లలకు అస్సలు చదువే చెప్పడం లేదు అంటూ ఆ స్కూల్ మాన్పించేస్తుంటారు. (అందుకే స్కూల్ వారు సైతం డిగ్రీ చదివినవారు కూడా పూర్తిచేయలేని హోంవర్క్‌ని ఎల్‌కేజీ పిల్లలకిచ్చేస్తూ తమ స్కూల్ గొప్పతనాన్ని చాటేస్తుంటారు)

2. మీ భావాల్ని పిల్లలపై రుద్దకండి. వారి ఆలోచనలను సక్రమమైన మార్గంలో తీసుకెళ్లే మార్గదర్శకులుగా మాత్రమే మీరు ఉండండి. అంటూ చెప్పే నీతి వాక్యాలని అందరూ వింటూనే ఉంటారు. కానీ పదేళ్లకే తమ బిడ్డ అబ్ధుల్ కలాం కన్నా గొప్పవాడై పోవాలి. వాడి ప్రతిభతో తమ పేరు ఢిల్లీ వరకు వినిపించాలని కోరుకోవడం మాత్రం ఏ తల్లీతండ్రీ కూడా ఆపరు.

ఇలాంటి వారిని చూసే కాబోలు ఈమధ్య డబ్బున్న బాలకార్మికులు అనే ఓ కొత్త నినాదం వినిపిస్తోంది. ఇలా అంటే అర్థం ఏంటో తెలుసా... ఈ పిల్లల తల్లితండ్రులకు కూడూ గుడ్డా దేనీకీ లోటుండదు. కానీ తమ పిల్లల చేత వయసుకు మించిన పనులు చేయించి తద్వారా తాము అందరిలో గుర్తింపబడాలన్నదే వారి తాపత్రయం. ఎంతటి దూరా(దురా)లోచనో కదా...

మరి ఇలాంటి వారి కడుపున పుట్టిన పాపానికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే ఆ పిల్లలు నిజంగా సుఖపడిపోయినట్టే. (ఈ చివరి వాక్యం రాయడానికి నేను చాలానే ఫీలయ్యాను. కానీ పిల్లలు ఏమైనా ఫర్వాలేదు... తమ పంతం నెరవేరితే చాలు అనుకునే తల్లితండ్రుల మూర్ఖత్వాన్ని తల్చుకున్నప్పుడు మాత్రం ఈ వాక్యం రాయడంలో తప్పేమీలేదు అని నాకు అన్పించింది.

నిరాకరణ