Web Webdunia.com సరదాగా
Webdunia Portal |  Greetings |  Classifieds |  E-mail |  Take A Tour |  Font Download |  Feedback
X
Welcome, Guest  [ Portal's List |  Create Portal |  Sign In ]
 లోడ్ అవుతోంది...

• మరిచిపోలేని నా 'ప్రేమకావ్యం'

అవి నేను బీఈడీ చదివేరోజులు. డిగ్రీ ముగించుకున్న తర్వాత త్వరగా ఉద్యోగం దొరికే దారేదీ అంటే... బీఈడీ చేయడమే దగ్గర దారని ఓ మేథావి ఇచ్చిన సలహాతో కాస్త కష్టపడి చదివి మరీ ర్యాంక్ తెచ్చుకుని బీఈడీలో జాయినయ్యా. అంతకుముందు డిగ్రీ పాస్ కావడానికి, బీఈడీ ఎంట్రెన్స్‌లో ర్యాంక్ సాధించడానికి బాగా కష్టపడిపోయిన నాకు (నా మెదడుకు) బొత్తిగా కళాపోషణన్నదే లేకుండా పోయింది.

అందుకే బీఈడీలో ఉండే ఏడాదిపాటు మెదడుకు ఆనందాన్ని తప్ప మరే ఇతర అంశాల్ని ఎక్కించరాదని ఓ గట్టి నిర్ణయానికొచ్చేశా. అయితే నాతోపాటు బీఈడీలో చేరిన మరికొందరు సైతం దాదాపు ఇదే నిర్ణయంతో వచ్చినట్టు నాకు ఆ తర్వాత తెలిసింది. ఇంకే ఓ శుభమూహూర్తాన ఇలాంటి గొప్ప నిర్ణయంతో ఉన్న ఆరుగురం ఓ రూమ్‌ని అద్దెకు తీసుకుని అందులో ఉంటూ కాలేజీకి వెళ్లిరావడం ప్రారంభించాం.

కాలేజీకి వెళ్లినప్పుడు లెక్చరర్లని సంతోషపెట్టడానికి తప్ప మరే ఇతర సమయాల్లోనూ పుస్తకాలు ముట్టుకోరాదని ఓ భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్న మేము ఆ విషయంలో మాత్రం మరికొందరికి సైతం ఆదర్శంగా నిలిచాం. ఇలాంటి తరుణంలో మాలాగే దూరప్రాంతాల నుంచి బీఈడీ చదవడానికి వచ్చిన మరికొంతమంది మేముంటున్న వీధిలోనే వేర్వేరుగా రూములు తీసుకున్నారు. అలా తీసుకున్న వారిలో కొందరు అమ్మాయిలు సైతం ఉన్నారు.

ఇంకేముంది కాలేజీలో అమ్మాయిల వంక దొంగచూపులు చూసే మన మగ విద్యార్ధి బృందం రూములకు వచ్చాక ధైర్యం చేసి అమ్మాయిల వంక కాస్త నేరు చూపులే చూడడం ప్రారంభించారు. అలా కొన్నాళ్లు గడిచాక కొందరు అబ్బాయిలకి అమ్మాయిలతో దోస్తీ కుదిరిపోయింది. దాంతో దోస్తీ కుదిరినవారు రూమ్‌లో ఉన్న మగ మిత్రుల కంటే తమ ఆడ మిత్రుల ?తో తిరగడమే పనిగా పెట్టుకున్నారు.

ఇవన్నీ చూచిన నాకు అరే మనం కూడా ఏ అమ్మాయితోనైనా దోస్తీ కడితే బాగున్నే అనిపిచడం ప్రారంభించింది. అంతే అప్పటినుంచి అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయిలతో అవసరం లేకున్నా అనవసరంగా మాట్లాడేస్తూ నాతోనూ కొందరు (ఇద్దరే లేండి) అమ్మాయిలు మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నా.

అయితే సజాతి దృవాలు ఆకర్షించవన్న సైన్స్ సామెతలా నాకెందుకో నాతో చదివే అమ్మాయిలు అస్సలు నచ్చేవారు కాదు. అలా పూతకొచ్చినా కాపురాని చెట్టులా కాలం గడిచిపోతున్న తరుణంలో కాలేజీలో మాకు ప్రాజెక్ట్ వర్క్ కేటాయించారు. ప్రాజెక్ట్ అంటే సిమెంట్, ఇసుకతో నిర్మించే ఎత్తిపోతల పథకమనుకునేరు అదేం కాదులేండి.

మేము చదివేది బీఈడీ కదా. భవిష్యత్‌లో కాబోయే టీచర్లమాయే. అందుకే పిల్లలు చదివే స్కూల్స్‌కు వెళ్లి పాఠాలు బోధించాలన్నమాట. అదే మా ప్రాజెక్ట్ వర్క్. అదిగో ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసమని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూర్లోని పాఠశాలను మాకు కేటాయించారు.

అందుకోసం నేను నా మిత్రబృందం ఉదయమే బస్సులో ఆ పాఠశాలకు వెళ్లి సాయంత్రం వరకు పిల్లలకు బోధించి (వారిని బాధించి అంటే బాగుంటుందేమో) తిరిగి బస్సులో పయనమై రూముకు చేరుకునే వాళ్లం. అలా నెలరోజులపాటు సాగిన ఆ పయనంలోనే నా ప్రేమ కావ్యం నా మిత్రుల ద్వారా ముందుమాట రాసేసుకుని నా అనుభూతులనే అక్షరాలను నింపేసుకుని పెళ్లికి ముస్తాబైన పెళ్లికూతురులా తయారైపోయింది.

అలా తయారైన ఆ ప్రేమ కావ్యంలోని పేజీలను మీ ముందు తెరుస్తున్నాను. చదవండి మరి. నేను నా ప్రాజెక్టు వర్క్ కోసం బస్సులో వెళ్లేవాడినని చెప్పాకదా. నేను ఎక్కే అదే బస్సులో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి బృందం కూడా ఎక్కేది. చదువుతున్నది ఇంజనీరింగ్ కదా. అందుకేనేమో వాళ్లు చూడడానికి కాస్త క్లాస్‌గా కనిపించేవారు (అనిపించేవారు).

ఆ బృందంలో సన్నగా, నాజూగ్గా, బారెడు జుట్టుతో, చారెడేసి కళ్లతో వచ్చే ఓ అమ్మాయి రూపం తొలిచూపులోనే నా గుండెల్లో గుచ్చుకుపోయింది. (అయితే నా గుండెకు ఎలాంటి గాయం కాలేదనుకోండి) దాంతో నా గుండె వేగం పెరిగి మెదడు పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆ అమ్మాయిని ఎలా ఆకర్షించాలా అన్న విషయం మాత్రం నాకు అర్ధం కాలేదు.

అందుకే నా వేదనను నా మిత్రుల ముందు వెళ్లగక్కా. దాంతో వాళ్లు తెగ రెచ్చిపోయి ఈ విషయంలో నీకు మేం పుల్‌గా కోపరేట్ చేసేస్తాం నువ్వేం దిగులు పడకు అని భరోసా ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్లు అదివరకే ప్రేమసాగరంలో కాళ్లు పెట్టి మోకాళ్ల దాకా మునిగి పోయారు కూడా. అదిగో అలా నా ప్రేమ కావ్యానికి నా మిత్రులు ముందుమాట రాసేశారు.

'ఆ అమ్మాయి దృష్టి నీపై పడాలంటే ముందు నువ్వు ఆ అమ్మాయి దృష్టిలో పడాలి'. ఇదండీ నా మిత్రులు నాకిచ్చిన తొలి సలహా. ఇంకే వెంటనే వారి సలహాని ఆచరణలో పెట్టేశా. బస్సు ఎక్కిన వెంటనే ఆ అమ్మాయికి కనబడేలా నిల్చుని ఆ అమ్మాయినే చూడడం ప్రారంభించా.

అలా కొద్దిరోజులు గడిచాక ఆ అమ్మాయి సైతం నన్ను చూడడం ప్రారంభించింది. చూడడం అంటే డైరెక్టుగా కాదులేండి. తన ఎదురుగా ఉన్న మరో అమ్మాయితో మాట్లాడుతూ ఓరకంట నన్ను చూచేది. ఇలా ఆ అమ్మాయి నన్ను చూస్తోందన్న విషయం నేనూ త్వరగానే గ్రహించేశాను.

ఆ విషయాన్నే ఓ రోజు నా మిత్రబృందంతో చెబితే అరే నువ్వు భలే అదృష్టవంతుడివిరా అంటూ ఓ పొగిడేశారు. వాళ్ల మాటలు వినేసరికి నాకు తెగ ఆనందమేసేసింది. ఇంకేం ఆ అమ్మాయి గురించి మిగిలిన విషయాలు కూడా సేకరిద్దాం అని రంగంలోకి దిగా. ఓరోజు ఆ అమ్మాయి నోట్‌బుక్ నాకు కనబడేలా పట్టుకోవడంతో దానిపై ఉన్న పేరుని దూరం నుంచే చదివేశా.

మహాలక్ష్మి ఆహా ఎంత అందమైన పేరు అని చదివిన వెంటనే అనిపించింది. అయితే ఆ ఆనందం నాకు కొంచెం సేపు కూడా మిగలకుండా పోయింది. బస్సులో కాస్త రద్దీ పెరగడంతో ఆ అమ్మాయికి కుడి పక్కనున్న నేను ఎడమవైపు జరిగా. నేను జరిగిన విషయాన్ని ఆ అమ్మాయి గమనించింది. కానీ కొంతసేపటికి నేను మరో కొత్త విషయం గమనించా.

నేను ఎడమవైపు జరిగినా నా మహలక్ష్మి మాత్రం ఇంకా కుడివైపే చూస్తోంది. కుడివైపు నా మిత్రుడున్నాడు. దాంతో నాకు పెద్ద అనుమానమోచ్చేసింది. కొంపదీసి ఆ అమ్మాయి నా మిత్రున్ని కానీ చూస్తోందా అని. అయితే నా అనుమానం తీరే సమయం, నా ప్రేమ కావ్యంలో చివరి పేజీ రాసే సమయం కూడా అప్పుడే వచ్చిందన్న విషయం నాకు ఆ క్షణాన తెలియదు.

ఆ అమ్మాయికి కుడివైపు ఉన్న నా మిత్రుడు కూడా నావైపుకు వచ్చేశాడు. ఇక అక్కడ మిగిలింది ఓ 60ఏళ్ల ముసలాయన మాత్రమే. అప్పటికీ మహాలక్ష్మీ ఆ వైపే చూస్తోంది. ఇవన్నీ చూస్తోన్న నాకు ఏం అర్ధం కాలేదు. అయితే నా అనుమానాన్ని తీర్చడానికే అన్నట్టు లక్ష్మీ అంటూ ఆ అమ్మాయిని ఎవరో పిలిచారు.

దాంతో ఆ అమ్మాయి మేమున్న వైపుగా తిరిగింది. ఆ అమ్మాయి తలైతే మావైపు తిప్పింది కానీ ఆమె చూపు మాత్రం పక్కకే ఉంది. అప్పుడు అర్ధమైంది నాకు ఆ అమ్మాయికి మెల్ల అని. అంతే నా ప్రమేయం లేకుండానే వేరెవరో నా ప్రేమ కావ్యానికి ముగింపు రాసేసినట్టుగా నా మెదడు మొద్దుబారిపోయింది.

అంటే ఇనాళ్లు ఆ అమ్మాయి తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఆ ఫ్రెండ్‌నే చూస్తోందన్నమాట. కానీ నేనే కళ్లు నాపైపు ఉందనుకుని నన్నే చూస్తోందని పొరబడ్డాను. మెల్ల ఉంటే అదృష్టమంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ నాకు మాత్రం నా మహాలక్ష్మి మెల్ల దురదృష్టాన్నే మిగిల్చింది.

అయినా ఏమాటకామాట చెప్పుకోవాలి. నా మహాలక్ష్మి కళ్లు మెల్ల అయినా ఐశ్వర్యారాయ్ కళ్ల కన్నా చాలా అందంగా ఉంటాయి.



కేటగిరీలు: Blog
 అత్యంత ప్రజాదారణ పొందిన వ్యాసాలు