Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Take a tour | Family Filter: On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

అసలు నా సమస్య ఏంటంటే.............???

హాయ్ ప్రెండ్స్ మీతో ఓ విషయం చెప్పాలి... విషయం అనేకన్నా బాధ అంటే బాగుంటుందేమో. ఇంతకీ సంగతేంటంటారా. ఏముందండీ ఈ మధ్య నాకు విచిత్రమైన సమస్య ఒకటి వచ్చిపడింది. సమస్య అంటే మరీ అంత పెద్దదేం కాదులేండి. అలాగని చిన్న సమస్యే కదాని ఊరుకుందామంటేనా అస్సలు వీలుకావడం లేదు.

అసలు ఈ సమస్య గురించి చెప్పకూడదనే అనుకున్నా. కానీ ఏం చేయను. చెప్పుకుంటే ఎలాంటి బాధైనా తగ్గుతుందని కొందరంటుంటే విని సరే చెప్పేదాం అని డిసైడయ్యాను. ఈ సమస్య గురించి మీకు చెప్పాలనుకున్నప్పుడు ఓ విషయం గుర్తొచ్చింది. ఆ విషయం కూడా నా సమస్యకు సంబంధించిందే అనుకోండి.

నా ఫ్రెండ్‌తో మాటల సందర్భంలో....... అగండాగండీ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని డౌట్ పడకండేం. నాకున్నది కేవలం భాయ్ ఫ్రెండ్స్ మాత్రమే. అదెందుకో నాకస్సలు గర్ల్ ఫ్రెండ్స్ లేరండీ. ఎందుకో గానీ నాకు ఏ అమ్మాయితో మాట్లాడాలన్నా కాళ్లల్లో చెమటలు పట్టేస్తాయి.

అదేంటీ కాళ్లల్లో చెమటలు పట్టడం అనుకుంటున్నారా..... ఎందుకులేండీ అది నాకున్న మరో సమస్య దాని గురించి ఇప్పుడొద్దులే గానీ....... మన విషయానికొద్దాం. అవును ఇంతకీ నేను ఏం చెబుతున్నాను.......... ఆ......... గుర్తొచ్చిందిలేండి. నాకున్న సమస్య గురించి కదా చెబుతున్నాను...... అవునండీ ఆ సమస్య గురించే మా ఫ్రెండ్ దగ్గర చెబుతామనుకుని మొదలు పెట్టేసరికి వాడు వాడి సమస్య గురించి చెప్పడం మొదలు పెట్టాడు.

దాంతో నేను నా సమస్య గురించి చెప్పడం ఆపేసి వాడి సమస్యను సావదానంగా వినడం ప్రారంభించా. అదేంటి వీడు తన సమస్య గురించి మర్చిపోయి ఇతరుల సమస్యలు వినడమేంటి అనుకుంటున్నారా...... సమస్య వల్ల ఎన్ని సమస్యలో స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి నాకు సమస్య వల్ల కలిగే సమస్యలు గురించి బాగా తెలుసు కాబట్టి.

ఇంతకీ మా ఫ్రెండ్ సమస్యేంటంటే ఎందుకులేండి వాడి సమస్యను మీకు చెప్పి మిమల్ని బాధపెట్టడం. అరే అలా విస్సుక్కోకండి....... ఎంట్రా వీడు సమస్య గురించి చెబుతానంటూ చెబుతాడే తప్ప అసలు విషయం చెప్పడం లేదు అనుకుంటున్నారు కదూ. చూశారా నేను మీ మనసులోని ఫీలింగ్స్‌ని ఎలా కనిపెట్టేశానో....... అదంతేనండీ నేను ఏ విషయానైనా ఇట్టే పసి కట్టేస్తాను.

అదేంటో నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి తెలివితేటలు బాగానే అబ్బాయి. అందుకే మా ఫ్రెండ్స్ కూడా నాకు అతి తెలివి అంటుంటారు. ఏంటో వాళ్ల అభిమానం కానీ నిజంగానే నాకు అన్ని తెలివితేటలున్నాయా అని నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది..... కానీ నా డౌట్ గురించి ఎవరికీ చెప్పలేదనుకోండి...... ఎందుకంటారా నా తెలివితేటల మీద నాకే డౌటుందని తెలిస్తే వాళ్లు నన్ను పొగడడం ఆపేయరూ.

అరరే.... మాటల్లో పడి మరిచే పోయాను. ఇంతకీ నా సమస్య గురించి చెప్పనేలేదు కదూ.... అదేనండీ నా సమస్య ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.... మీరైనా చెప్పండి నా సమస్య మీకెలా చెప్పాలో......... చెప్పండీ ప్లీజ్.

నిరాకరణ