మనకెందుకులే, ఆ........ మనమొక్కరం చేస్తే ప్రపచం మారిపోతుందా, అయినా మనదేశంలో ఇవంతా మామూలే బాసూ........... చెబుతావు కానీ..... నీ దాకా వస్తే నువ్వూ ఇలాగే చేస్తావోయ్...... ఇలాంటి మాటలు మనం తరచూ వినేవే. అసలు విషయం చెప్పకుండా ఏంటీ మాటలు అనుకుంటున్నారా..... మనవాళ్లు చేసే కొన్ని నిర్లక్షపు పనులకు వారికి వారిచ్చుకునే కొన్ని రకాల సమాదానాలు, ఏంటని అడిగిన వారికిచ్చే కొన్ని రకాల వివరణలు ఇలాగే ఉంటాయి మరి...
మనం రోజూ వేళ్లే ప్రదేశంలో ఓ రాయి అడ్డంగా ఉంటుంది. కాస్త ఆగి దాన్ని తీసేస్తే దాని వల్ల కలిగే ఇబ్బందులకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. కానీ మనం అలా చేయం ఎందుకంటే ఆ.... మనకెందుకులే అనే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి మూల్యం మరో రోజు చూసుకోకుండా అదే రాయి తగిలి బోర్లా పడి పళ్లు రాలకొట్టుకోవడం.
అదేంటిరా లంచం ఇవ్వకుండా వాడిపై కంప్లైంట్ చేయచ్చు కదరా అంటే ఆ........ మనమొక్కరం కంప్లైంట్ చేస్తే మాత్రం ప్రపంచం మారిపోతుందా చాల్లే ఊరుకో అంటాం. తర్వాత కాలంలో ఇచ్చుకోలేనంత లంచం ఇవ్వాల్సి వచ్చినపుడు లంచగొండులు నశించాలి అని మనమే ఓ చిన్న ఉపన్యాసం ఇచ్చేస్తాం.
అలాగే ఆ పని ఇక్కడ చేయకండి అంటూ తాటికాయంత అక్షరాలతో రాసున్నా అక్కడే ఆ పని కానిచ్చేయడం. ఎంట్రా అని అడిగితే ఇక్కడ కాకుంటే మరెక్కడ చేస్తామోయ్. అయినా మనదేశంలో ఇవంతా మామూలే బాసూ......అని వేదాంతాలు వల్లించేస్తా. కానీ మనింటి గోడపైన వేరొకరు అదేపని చేస్తే ఓ రాయి తీసుకుని వాడిని వీధి చివరిదాకా తరిమికొడతాం. అంతేనా ఎద్దులా ఎదిగాడు ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ బండబూతులు తిట్టేస్తాం.
అలా కొంపలంటుకుపోయినట్టు బస్సు పుట్ బోర్డుపై వేలాడుతూ రాకపోతే తర్వాతి బస్సుకు రావచ్చు కదా అంటే ఆఫీసుకు ఇప్పటికే పది నిమిషాలు లేటైపోయింది. బలే చెప్పోచ్చావ్. నీ దాకా వస్తే నువ్వూ ఇలాగే చేస్తావ్ గానీ ఇక నీతులు చెప్పడం ఆపేయ్ అంటాం. కానీ మరోసారి ఎవరో పుట్‌బోర్డ్ నుంచి పడి ఆస్పత్రి పాలయ్యాడని తెలిస్తే బుద్ధిలేని వెధవలు కాస్త ఆలస్యమైనా జాగ్రత్తగా వెళ్లరాదూ. ప్రాణాలు పోతే తిరిగొస్తాయా అంటూ పక్కవారు వినకపోయినా ఉపన్యాసాలు దంచేస్తాం.
పైన చెప్పినవన్నీ మీకు చెప్పాను అనుకునేరు. అయినా నేను చెబితే వినడానికి మీకేమైనా ఇవ్వనీ తెలియదా ఏం. అందరికి అన్నీ తెలసు. కానీ దేన్నీ పాటించం. ఎందుకంటే పాటించడానికి మనమేమన్నా స్కూలు కెళ్లే పిల్లలమా. అయినా ఈ మధ్య పిల్లలే పెద్ద వాళ్ల మాటలు వినడం లేదు. అందుకే మనం కూడా అన్నీ తెలిసినా నిర్లక్షంగానే వ్యవహరిద్దాం. ఎదుటివారికి మాత్రం తరచూ నీతులు వల్లించేద్దాం ఓకేనా. మళ్లీ కలుద్దాం.

లోడ్ అవుతోంది...